ఖమ్మం, జూలై 25(స్టేట్ న్యూస్ తెలుగు): బ్యాంకింగ్ రంగంలో రాణించాలంటే కస్టమర్లకు సరైన సమయంలో సహాయ సహకారాలు అందించాలని కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్ చంద్రశేఖర అన్నారు. గురువారం కెనరా బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వారోత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ… చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా మన బ్యాంకుపై నమ్మకంతో వచ్చిన ప్రతి కస్టమర్ మనకి దేవుడు లాంటి వారని, వారి మన్నలను మనం పొందిన నాడే బ్యాంకు పురోభివృద్ధికి అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నేడు సమాజంలో అనేక రకాల బ్యాంకులు వస్తున్నాయని కొన్ని నిలతొక్కుకుంటే మరికొన్ని కనుమరుగవుతున్న సంగతి మనం చూస్తున్నామన్నారు.
ఖమ్మం మెయిన్ బ్రాంచ్ నందు ఉద్యోగులు, సిబ్బంది నిత్యం కస్టమర్లకు తగు సహాయ సహకారాలు అందించడం వలన మాత్రమే 50 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామన్నారు. ఏజీఎం మాధవి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత ఖమ్మం అత్యంత పెద్ద నగరం అని ఇక్కడ వ్యాపారులు కానీ, కార్మికులు కానీ, రైతులు కానీ చాలా నమ్మకంతో బ్యాంకులకు వస్తారన్నారు. తాను వారంలో ఒక రోజైనా ఈ బ్యాంకుకు వస్తానని ఇక్కడ సిబ్బంది ఖాతాదారులతో ఎంతో మెలకువగా ఉంటారని, ఖాతాదారులు సైతం ఈ బ్యాంకు తమ బ్యాంకు అనే విధంగా సిబ్బంది ప్రవర్తిస్తారని అన్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో సిబ్బంది పనితీరు వారు ఖాతాదారులతో పెట్టుకునే సంబంధాలు బ్యాంకుల అభివృద్ధికి నిచ్చెనల పనిచేస్తాయి అన్నారు. కార్యక్రమంకు ముందు కొన్ని దశాబ్దాలుగా బ్యాంకులో ఖాతాను ప్రారంభించి నేటి వరకు ఎన్ని బ్యాంకులు వచ్చినప్పటికీ ఇదే బ్యాంకులో కొనసాగుతూ ఉన్న అనేక మందికి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా సన్మాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ మేనేజర్ పడయ్య, హీరేమత్, సీనియర్ మేనేజర్లు రమ్యరెడ్డి, జి నాగేశ్వరరావు, విజయ చంద్, ఆర్ వెంకటేష్, మేనేజర్లు ఎర్రయ్య, బి రాజు, రామకృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.