స్టేట్ న్యూస్ తెలుగు సెప్టెంబర్ 30,( భద్రాచలం)
ప్రతి సంవత్సరం వినాయక చవితి తరువాత భాద్రపద బహుళ పక్షంలో పితృదేవతలు సంతోషించి తమ సంతానానికి దీవెనలు ఇచ్చే రోజులే మహాలయ పితృపక్షాలు.ఈ 15 రోజులు తమ పితృదేవతలను సంతృప్తి పరచి వారి శుభాశీస్సులను కుటుంబ సభ్యులు అందుకుంటారు.

సెప్టెంబర్ 18 వ తేదీ భాద్రపద బహుళ పాడ్యమి బుధవారం నుండి అక్టోబర్ 2వ తేదీ మహాలయ అమావాస్య (పెద్దల అమావాస్య) బుధవారం వరకు నిర్వహించే ఈ పర్వ దినాలలో స్వర్గస్తులైన తమ తల్లిదండ్రులకు, గతించిన ఇతర పెద్దలకు వారి కుమారులు మహాలయ శ్రార్ధములు (పిండ ప్రధానములు) ఆచరిస్తారు.పుణ్యక్షేత్రాలలో జీవనదులు ప్రవహిస్తున్న పుణ్య తీర్థాల వద్ద అధిక సంఖ్యలో ఈ పిత్రు కార్యాలు చేసుకుంటారు.సోదర సమేతంగా శ్రీరామచంద్రుడు తన తండ్రి దశరధునికి పిత్రు కార్యం ఆచరించిన ప్రాంతమైనందున భద్రాచలం దివ్య క్షేత్రాన్ని పితృ ముక్తి క్షేత్రం అని అంటారు.
శ్రీరాముడు గోదావరి నదిలో పిత్రుకార్యం నిర్వహించినందున, భద్రాచలం పవిత్ర గోదావరి నదిలో జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య స్వామి వారు పుణ్య గోదావరి నదిలో స్నానమాచరించి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నందున భద్రాద్రి గోదావరి నది వద్ద అధిక సంఖ్యలో భక్తులు పితృ కార్యాలు చేస్తుంటారు.
మహాలయ పితృపక్షాలు కేవలం రెండు రోజులే ఉన్నందున గడచిన శని, ఆది, సోమవారాలు తెలుగు రాష్ట్రాలు, చత్తీస్గడ్, ఒరిస్సాల నుండిఅధిక సంఖ్యలో వచ్చిన భక్తులు గోదావరి పుణ్యనది స్నానాలు ఆచరించి పితృదేవతలకు పిండ ప్రధానాలు నిర్వహించారు.

అక్టోబర్ 2వ తేదీ మహాలయ అమావాస్య అయినందున అధిక సంఖ్యలో భక్తులు నదీ స్నానాలు చేసి పితృదేవతలకు తీర్థ విధులు ఆచరించి పితృదేవతల దీవెనలు అందుకుంటారు.అంతరం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారిని దర్శించుకుని స్వామివారి శుభాశీస్సులు పొందుతారు.