స్టేట్ న్యూస్ తెలుగు,12 మే (ఖమ్మం)
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని పోలింగ్ కేంద్రాలలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు.
లోకసభ సాధారణ ఎన్నికలు-2024 పురస్కారించుకొని ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ గ్రామంలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పోలీస్ కమిషనర్ సందర్శించి ఎన్నికల బందోబస్తు విధులకు హజరవుతున్న పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్ మాట్లాడారు. ఎన్నికల విధులలో పోలీస్ సిబ్బంది నిర్వహించే విధివిధానాలపై పలు సూచనలు చేశారు. సెక్షన్ 144 అమలులో వున్నందున భద్రతపరమైన అన్ని చర్యలు పకడ్బందీగా ఉండేట్లు చూసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ పక్రియ ముగిసిన ఆనంతరం ఈవీఎంలు తిరిగి స్ర్టాంగ్‌రూమ్ కు వచ్చే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.230 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా పోలీస్ పెట్రోలింగ్ బృందాలు నిరంతరం ప్రజలకు అందుబాటులో వుంటూ విధులు నిర్వహిస్తున్నట్లు పెర్కొన్నారు. ప్రశాంత వాతావరణాన్ని భంగం కలిగించే నేరచరితులను బైండోవర్ చేశామని తెలిపారు.
ఇప్పటికే జిల్లాకు చేరుకున్న 6 కంపెనీల కేంద్ర బలగాలతో పాటు 2391 మంది స్ధానిక పోలీసులు, టిఎస్పీఎస్ బెటాలియన్స్,వివిధ విభాగాల నుండి వచ్చిన పోలీసు సిబ్బంది ఎన్నికల విధులలో పాల్గొంన్నాయని తెలిపారు.
పోలింగ్ కు రెండు రోజుల ముందు మద్యం, నగదు అక్రమ రవాణా అయ్యే ఆవకాశం వున్న నేపథ్యంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలో వాహనాల తనిఖీలపై మరింత దృష్టి సాధించారని, ఈ నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామున కూసుమంచి పోలీస్ స్టేషన్ పరిధిలో దేవుని తండా వద్ద ఇన్నోవా వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 99.94 లక్షల రూపాయలు గుర్తించి కేసు నమోదు చేసి అదాయపు శాఖ అధికారులకు సమాచారం అందించామని తెలిపారు.
ట్రైనీ ఏఎస్పీ మౌనిక, టౌన్ ఏసీపీ రమణమూర్తి, రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్ది ఇతర అధికారులు పాల్గొన్నారు.